తెలంగాణ

telangana

ETV Bharat / international

హెజ్‌బొల్లాకు చావుదెబ్బ! ఉగ్రసంస్థ చీఫ్​​ కుమార్తె మృతి! లెబనాన్​పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్​! - Israel Hezbollah War - ISRAEL HEZBOLLAH WAR

Hezbollah Leader Daughter Dead : లెబనాన్​ రాజధాని బీరుట్​పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్​బొల్లా అధినేత హసన్ నస్రల్లా కుమార్తె మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా హెజ్​బొల్లా, లెబనాన్​ అధికారులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Hezbollah Leader Daughter Dead
Hezbollah Leader Daughter Dead (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 1:06 PM IST

Updated : Sep 28, 2024, 1:20 PM IST

Hezbollah Leader Daughter Dead : హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థను ఇజ్రాయెల్‌ గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లోని రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా కుమార్తె మృతి చెందినట్లు తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. హసన్‌ నస్రల్లా లక్ష్యంగా దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు శుక్రవారం వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లోనే నస్రల్లా కుమార్తె జైనబ్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే, జైనబ్‌ మృతిని హెజ్‌బొల్లా గానీ, లెబనాన్‌ అధికారులు గానీ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. హెజ్‌బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడా లేదా సురక్షితంగానే ఉన్నాడా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. నస్రల్లా మరణించినట్లు ఇప్పుడే చెప్పలేమని ఇజ్రాయెల్‌ చెబుతోంది. అయితే, తాము జరిపిన దాడుల్లో ఆయన బతికే అవకాశాలు లేవని అంటోంది.
హెజ్‌బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. జైనబ్‌ మరణించినట్లు కథనాలు రావడం వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రతీకార చర్యలు
మరోవైపు హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్‌లోని సఫేద్‌ నగరంలోని ఓ భవనం ధ్వంసమైంది. రాకెట్‌ దాడులు కారణంగా ఉత్తర ఇజ్రాయెలోని పలు ప్రాంతాల్లో సైరన్‌లు మోగుతున్నాయి. హెజ్‌బొల్లా అధినేత కుమార్తె జైనబ్‌ మృతి చెందినట్లు కథనాలు రావడం వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. జైనబ్‌ మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న దాడులు
హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా రెండోరోజు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా దక్షిణ బీరుట్‌ వీధులు ఖాళీ అవుతున్నాయి. పెద్ద ఎత్తున పొగ చుట్టపక్క ప్రాంతాలను కమ్మేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేలాది మంది లెబనాన్‌ ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్తున్నారు.

దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలుగా అనుమానిస్తున్న మూడు భవానలకు సమీప ప్రాంతాన్ని అక్కడి వారు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసిన అనంతరం దాడులు చేసిన చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరిపినప్పుడు నుంచి ఇప్పటివరకు దాదాపు 2 లక్షల 11 వేల మంది లెబనాన్‌ పౌరులు తమ ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వచ్చిందని ఐరాస లెక్కలు చెబుతున్నాయి. లెబనాన్‌లో 20 ఆరోగ్య కేంద్రాలు మూతపడినట్లు పేర్కొన్నాయి.

Last Updated : Sep 28, 2024, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details