White House On Biden Statement :భారత్, జపాన్ను తక్కువ చేసేలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన వేళ వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. బైడెన్‌కు భారత్, జపాన్ దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందని తెలిపింది. అధ్యక్షుడి వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని పేర్కొంది.
భారత్, జపాన్‌పై బైడెన్ వ్యాఖ్యలు
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వ్యాఖ్యానించారు. రష్యా, చైనా, జపాన్‌లదీ అదే పరిస్థితి అన్నారు. అవి వలసదారులను ఎంతమాత్రమూ ఆహ్వానించవని పేర్కొన్నారు. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అందుకు భిన్నంగా యూఎస్ విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటం వల్ల శ్వేతసౌధం దిద్దుబాటు చర్యలను చేపట్టింది.
"మా మిత్రదేశాలు, భాగస్వాములకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంత గౌరవిస్తారో బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో వివరించారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాలి. జపాన్, భారత్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశాం. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్ విశ్వసిస్తున్నారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం మా దేశానికి చాలా ప్రయోజనం"