UN On Minority Attacks In Bangladesh :జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, హింసను ప్రోత్సహించే వారిని అంగీకరించబోమని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. వాటిని వెంటనే నివారించాలని సూచించింది. మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇక బంగ్లాలో హిందువులపై దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పష్టం చేశారు. గత కొన్ని వారాలుగా సాగుతున్న ఈ హింస ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై గుటెరస్ అభిప్రాయాన్ని కోరగా, ఆయన తరఫున హక్ స్పందించారు. రిజర్వేషన్ల సంస్కరణల కోసం బంగ్లాదేశ్‌లో మొదలైన ఆందోళనల్లో హింస చెలరేగి పలు హిందూ ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతిచ్చిన ఇద్దరు హిందూ నాయకులనూ చంపేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద హింసపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్ ఆందోళన
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులపట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ‘బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుపై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి మోదీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు, హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతుంది’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కమిటీలో బెంగాల్ దక్షిణ, త్రిపుర విభాగాల బీఎస్‌ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.