Vikram Misri On Minority Communities In Bangladesh :భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి తాజాగా బంగ్లాదేశ్‌కు వెళ్లారు. భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడం వల్ల బంగ్లా విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగశాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్‌తో జరిగిన భేటీలో ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ఆ దేశంలోని హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. బంగ్లాలో ఇటీవల జరిగిన పరిణామాలపై, ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ గురించి చర్చించినట్లు మిశ్రి మీడియాతో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం : భారత విదేశాంగ కార్యదర్శి - VIKRAM MISRI BANGLADESH VISIT
బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి పర్యటన - ఇటీవల జరిగిన పరిణామాలపై ద్వైపాక్షిక చర్చలు
![బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం : భారత విదేశాంగ కార్యదర్శి Vikram Misri Bangladesh Visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-12-2024/1200-675-23077921-thumbnail-16x9-vikram.jpg)
Published : Dec 9, 2024, 8:27 PM IST
|Updated : Dec 9, 2024, 10:39 PM IST
బంగ్లాదేశ్ దళాలు భారత సరిహద్దుల్లో డ్రోన్ల మోహరించిన విషయం గురించి కూడా ఇదే వేదికగా మాట్లాడామని అన్నారు. "బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక, ప్రయోజనకరమైన సంబంధాన్ని భారత్ కోరుకుంటోందని తెలిపాము. ఇక్కడి యూనస్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఎదురు చూస్తున్నాం" అని మిశ్రి తెలిపారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితి మరింత దిగజారింది. ఆయనకు న్యాయసాయం అందించడం గురించి కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వీరిద్దరూ ఢాకా నుంచి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు అయ్యిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది.