Venezuela Gold Mine Collapse :వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని కూలిపోయి 14 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇంకొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంగోస్తురా మున్సిపాలిటీలోని బులాలోకా గని వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గంటసేపు బోటులో ప్రయాణిస్తేకానీ ప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకోవడం కష్టం.
'మృతుల సంఖ్య పెరిగే అవకాశం'
ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశామని బొలివర్ గవర్నర్ ఏంజెల్ మార్కానో తెలిపారు. 11 మంది గాయపడినట్లు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంగోస్తురా మేయర్ పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. సహాయక చర్చల్లో వేగం పెంచాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
'హెలికాప్టర్లు ఏర్పాటు చేయండి'
బాధితుల కుటుంబసభ్యులంతా లా పరాగ్వాకు చేరుకున్నారు. ఘటనాస్థలి నుంచి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయే పరిస్థితి ఉందని, వెంటనే తమకు అప్పగించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సహాయం చేయాలని వేడుకుంటున్నారు.