US Primary Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మంగళవారం జరిగిన ఇల్లినాయీస్, ఫ్లోరిడా, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. అనంతరం మాట్లాడిన బైడెన్, 2020లో తాను ట్రంప్‌ను ఓడించడానికి లాటినో ఓటర్లే కారణమని చెప్పారు. 2020లో లాగా మళ్లీ ట్రంప్‌ను ఓడించడానికి మీరు సహాయం చేయాలని లాటినో ప్రజలను కోరారు.
కొన్ని వారాల నుంచి ట్రంప్, బైడెన్ నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించారు. పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవలె ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావటం వల్ల ట్రంప్ బృందం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పింది.