తెలంగాణ

telangana

బైడెన్​ ప్లేస్​లో మరొకరు! తప్పుకోవాలని పెరుగుతున్న డిమాండ్లు- క్లారిటీ ఇచ్చిన డెమోక్రాటిక్ పార్టీ - US Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 7:14 AM IST

US Presidential Election 2024 Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నారని రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలను డెమోక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జో బైడెన్ పోటీలో​ ఉంటారని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అధ్యక్ష రేసులో జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజూకు మరింత పెరుగుతున్నాయి.

US Presidential Election 2024
US Presidential Election 2024 (Associated Press)

US Presidential Election 2024 Joe Biden : అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్థానంలో మరో యువనేతను బరిలో దించే అవకాశం ఉందన్న వార్తలను అధికారపార్టీ తోసిపుచ్చింది. తమ పార్టీ తరఫున బైడెనే పోటీలో ఉంటారని స్పష్టం చేసింది. బైడెన్‌ స్థానంలో సమర్థుడైన ఓ యువనేత రానున్నారని రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్న నేపథ్యంలో డెమోక్రాటిక్‌ పార్టీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్‌ను బైడెన్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలరని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఒక బిగ్‌ డిబేట్‌లో విఫలమైనంత మాత్రాన ఆయన స్థానంలో మరొకరు తెచ్చే ఆలోచన లేదని పేర్కొంది.

జో బైడెన్ స్థానంలో ఓ యువనేత సమర్థవంతమై వ్యక్తి రానున్నారని, ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాలని సొంతపార్టీని నిక్కీ హేలీ హెచ్చిరించారు. 'రాబోయే మార్పును ఎదుర్కొనేందుకు రిపబ్లికన్​ పార్టీ సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అధ్యక్ష అభ్యర్థిగా ఒకవేళ జో బైడెన్‌ను కొనసాగిస్తే డెమోక్రాటిక్‌ పార్టీ మనుగడ సాగించే అవకాశం లేదు. అందుకే ఓ యువ అభ్యర్థిని తీసుకువచ్చే యోచనలో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ ఉండరని కచ్చితంగా చెప్పగలను' అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.

రేసు నుంచి బైడెన్ తప్పుకోవాల్సిందే
ఇక గతవారం అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబేట్‌లో బైడెన్‌ తడబడటం వల్ల సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వయోభారంగా కారణంగా డిబేట్‌లో బైడెన్‌ సమర్థంగా పాల్గొనలేదన్న వార్తలతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆందోళన చెందారు. మరోవైపు ఈ సారి ఎన్నికల బరిలో నుంచి జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు మరింత పెరుగుతున్నాయి. అధికార పార్టీలోని పలువురు కీలక నేతలతో పాటు కొన్ని ప్రముఖ వార్తాసంస్థలూ కూడా ఇదే అంటున్నాయి. తాజాగా ది న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 'దేశానికి సేవ చేయాలంటే, అధ్యక్ష పదవి రేసు నుంచి బైడెన్‌ వైదొలగాలి. ఈ సారి ఆయన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కొనసాగడంలో హేతుబద్ధత ఏమీ లేదు' అని పేర్కొంది. 'డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి బైడెన్‌ను తప్పించడం అత్యంత దేశభక్తితో కూడిన ఐచ్ఛికం' అని ది అట్లాంటిక్‌’ పేర్కొంది.

మరోవైపు అట్లాంటాలో డొనాల్డ్ ట్రంప్‌తో సంవాదం అనంతరం స్వతంత్ర ఓటర్లలో 10% మంది జో బైడెన్‌ వైపు మొగ్గుచూపారని ఓ సర్వేలో తేలినట్లు అధ్యక్షుడి బృందం పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19-22 మధ్య భేటీ కానున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1,975 మంది మద్దతు అవసరం కాగా బైడెన్‌కు 3,894 మంది మద్దతు ఉంది.

బ్రిటన్‌లో హిందూ ఓటర్లపై పార్టీల ఫోకస్​- ఆలయాలను సందర్శిస్తూ! - UK General Elections

మరిన్ని నెలలు అంతరిక్ష కేంద్రంలోనే సునీత- వ్యోమగాములు ఇద్దరూ సేఫ్!

ABOUT THE AUTHOR

...view details