US Opinion Polls TrumpBiden: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం లభించిన్నట్లు తెలిసింది.
ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ అధిక్యం
ఈ సర్వేలో జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఓపీనియన్ పోల్‌ను నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు.
సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినవారి కంటే అసంతృప్తిగా ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. అదే ట్రంప్ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని ఆరు రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయ వ్యక్తం చేశారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్ మార్కులు వచ్చాయి. మరోవైపు ప్రధాన పోల్స్‌ను నిరంతరం పర్యవేక్షించే 'రియల్ క్లియర్ పాలిటిక్స్' మాత్రం బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.