తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఎస్​ ఎంబసీపై రష్యా గురి - ఆగమేఘాల మీద ఖాళీ చేసిన అగ్రరాజ్యం - US EMBASSY IN KYIV SHUTS DOWN

ఉక్రెయిన్‌లోని యూఎస్​ దౌత్యకార్యాలయంపై దాడికి రష్యా ప్లాన్! - అందుకే ఎంబసీని ఖాళీ చేశామన్న అగ్రరాజ్యం!

US Embassy In Kyiv Shuts Down
US Embassy In Kyiv Shuts Down (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 3:21 PM IST

Updated : Nov 20, 2024, 4:32 PM IST

US Embassy In Kyiv Shuts Down :ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. కీవ్‌లోని తమ దౌత్య కార్యాలయంపై రష్యా బుధవారం భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నవంబర్‌ 20న దాడి జరగబోతోందని తమకు కచ్చితమైన సమాచారం అందిందని పేర్కొంది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్‌ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని మెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.

అమెరికా బాటలో ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌
రష్యా దాడి చేయవచ్చనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో పలు దేశాలు కూడా అమెరికా బాటలోనే నడిచాయి. ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌లు కూడా ఉక్రెయిన్​లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అగ్నికి ఆజ్యం!
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింతగా ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో ఆగ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్‌ ఏకంగా ఆరు దీర్ఘశ్రేణి క్షిపణుల్ని (ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌) రష్యా పైకి ప్రయోగించింది. ఇందులో ఐదింటిని కూల్చేశామని, మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఈ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉండడం వల్ల, పొరుగునున్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి.

అణుయుద్ధ జరిగేనా?
అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా చర్యలు ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు నెడుతున్నాయా అనే అనుమానాలు రేకితిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నానాటికీ ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలకు మరింత బలం చేరుకూరుతోంది. ఒకవైపు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతివ్వడమే కాక వాటిని పెద్దఎత్తున తరలిస్తోంది. మరోవైపు అందుకు ధీటుగా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను సరళతరం చేసి అమెరికాకు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు పంపిన రష్యా, ఇప్పుడు నేరుగా అగ్రరాజ్యం దౌత్యకార్యాలయాలపై దాడులు సిద్ధమైనట్లు తెలుస్తుండడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అటు నాటో కూటమిలో సభ్య దేశమైన యూకే ల్యాండ్‌మైన్లు, పేలుడు పదార్థాలను ఎలా నిర్వీర్యం చేయాలో ఉక్రెయిన్‌ దళాలకు శిక్షణ ఇస్తుండడంతో రష్యాకు మింగుడు పడడం లేదు. అదీనూ తమ సొంతగడ్డపై ఉక్రెయిన్‌ సైన్యానికి యూకే శిక్షణ ఇస్తుండడం రష్యాకు ఆగ్రహాం తెప్పిస్తోంది.

అమెరికా-రష్యా మధ్య నో హాట్‌లైన్‌!
రష్యా-అమెరికా మధ్య అపార్థాలను తొలగించుకోవడానికి ఏర్పరుచుకున్న హాట్‌లైన్‌ వ్యవస్థ ప్రస్తుతం వాడుకలో లేదని క్రెమ్లిన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ధ్రువీకరించారు. రష్యా-అమెరికా అధ్యక్షుల మధ్య చర్చలు జరపేందుకు ఓ సురక్షిత కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉండేదని, ప్రస్తుతం అది వినియోగంలో లేదని దిమిత్రి పేర్కొన్నారు. క్యూబా మిసైల్‌ సంక్షోభం తలెత్తిన సమయంలో అపార్థాలకు తావివ్వకుండా ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు అనువుగా రష్యా-అమెరికా 1963లో హాట్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నాయి. అంత వరకూ టెలిగ్రామ్‌లపై ఆధారపడిన ఇరు దేశాలు హాట్‌లైన్‌ అందుబాటులోకి వచ్చాక, నేరుగా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లభించింది. పైగా దానిలో వీడియో కూడా ప్రసారం చేయగలిగేలా ఉండేది. కానీ అది ఇప్పుడు వినియోగంలో లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు.

Last Updated : Nov 20, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details