World leaders Congratulate Trump :అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ దేశాధినేతలు అభినందనలు తెలిపారు. ట్రంప్‌నకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. "మీ మునుపటి పదవీకాల విజయాలకు తగ్గట్టుగా భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దాం. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదాం" అని రాసుకొచ్చారు.
ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు మంచి స్నేహితులు!
అతిపెద్ద విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు చెప్పారు. ఇజ్రాయెల్- అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి ఈ విజయం దోహదం చేస్తుందన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌నకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు మంచి స్నేహితులని, నిజమైన మిత్రదేశాలని వెల్లడించారు.
అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధం!
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. అమెరికా-పాక్ మధ్య సంబంధాలను కొత్త ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆశించారు. ట్రంప్‌నకు శుభాకాంక్షలు చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఇటలీ, అమెరికా సిస్టర్ నేషన్స్‌గా అభివర్ణించారు. అద్భుత విజయం సాధించిన ట్రంప్‌నకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్‌కు కాంగ్రెస్ పార్టీ అభినందనలు
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్ట్ పెట్టారు. భారత్, అమెరికా మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని గుర్తుచేశారు. మరోవైపు, ట్రంప్ విజయం సాధించడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కొందరు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అయోధ్యలో పురోహితులు హోమం నిర్వహించారు.
కనిష్ఠ స్థాయికి ఇరాన్ కరెన్సీ విలువ
ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న వేళ ఇరాన్ కరెన్సీ రియాల్ బుధవారం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 703,000 రియాల్స్ వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, డాలర్ విలువ 1.5 శాతం పెరిగి 154.33 చైనీస్ యెన్‌లకు చేరుకుంది. జులై నుంచి ఇదే అత్యధికం. బిట్ కాయిన్ విలువ దాదాపు $6,000 పెరిగి రికార్డు స్థాయిని తాకింది. మార్చిలో గరిష్ఠ స్థాయి $73,797.98గా ఉండగా, ఇప్పుడు $75,005.06కు చేరుకుంది.