Trump On Gaza Strip :గాజాను స్వాధీనం చేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పాలస్తీనియన్లు అందరూ వేరే ఏదైనా ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లి స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకుని, దాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు.
'పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటుంది. యుద్ధంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఖండించిన హమాస్
గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి సమీఅబు జుహ్రీ మండిపడ్డారు. మా ప్రజలు దీనిని ఆమోదించరాని, వారి భూమి నుంచి వారినే తరలించడమే కాకుండా, ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉంది అని ఓ ప్రకటనలో తెలిపారు.