తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్‌ సంచలన నిర్ణయం - నాసా చీఫ్‌గా మస్క్‌ బిజినెస్‌ ఫ్రెండ్‌ - NEXT NASA CHIEF

నాసా తదుపరి చీఫ్‌గా బిలియనీర్‌, ప్రైవేట్‌ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌

NASA Chief Jared Isaacman
NASA Chief Jared Isaacman (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 9:58 AM IST

NASA Chief :అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన పాలకవర్గంలో నియామకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) తదుపరి చీఫ్‌గా బిలియనీర్‌, ప్రైవేట్‌ వ్యోమగామి జేర్డ్‌ ఐజాక్‌మెన్‌ (41)ను నామినేట్‌ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఐజాక్​మెన్, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ వ్యాపార స్నేహితుడు కావడం వల్ల ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

'సరికొత్త లక్ష్యాల దిశగా నాసా'
వ్యాపారవేత్త, దాత, పైలట్‌, వ్యోమగామి అయిన జేర్డ్‌ ఐజాక్‌మెన్‌ను నాసా అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని డొనాల్ట్ ట్రంప్ అన్నారు. ఆయన నాయకత్వంలో నాసా మిషన్‌ మరింత పురోగతి సాధిస్తుందని తెలిపారు. స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నామని డొనాల్ట్ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పోస్ట్​ చేశారు.

ఎవరీ జేర్డ్‌ ఐజాక్‌మెన్‌
'షిఫ్ట్4 పేమెంట్స్‌' కంపెనీ సీఈవోగా ఉన్న జేర్డ్ ఐజాక్‌మెన్‌ తన 16వ ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించారు. ఆయనకు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసిన తొలి ప్రైవేట్‌ వ్యోమగామిగా గుర్తింపు సాధించారు ఐజాక్​మెన్.

స్పేస్​వాక్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్
ఈ ఏడాది సెప్టెంబరులో స్పేస్‌ఎక్స్‌ సంస్థ 'పొలారిస్‌ డాన్‌' ప్రాజెక్టు కింద ఫాల్కన్‌-9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపిన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ నలుగురులో ఒకరైన జేర్డ్ ఐజాక్‌మెన్‌ క్యాప్సుల్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ చేశారు. ప్రొఫెషనల్‌ వ్యోమగాములు కాకుండా, అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలి వ్యక్తిగానూ ఆయన చరిత్ర సృష్టించారు.

ఇక, స్పేప్‌ఎక్స్‌ కార్యకాలాపాల్లోనూ ఐజాక్‌మెన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 2021లో ఈ కంపెనీ చేపట్టిన ఇన్ఫిరేషన్‌ 4 ఆర్బిటల్‌ మిషన్‌కు ఆయన సొంతంగా 200 మిలియన్‌ డాలర్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కమాండర్‌గానూ వ్యవహరించి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు ఐజాక్​మెన్. కానీ ప్రభుత్వం, రాజకీయాలతో పెద్దగా పరిచయాలు లేవు.

ABOUT THE AUTHOR

...view details