Trump Challenges To Biden : ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా దూసుకుపోతున్న మాజీ, ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సవాళ్లు విసురుతూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్, తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మరో సవాల్ విసిరారు. తనతో గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అంటూ ఫ్లోరిడాలో నిర్వహించిన సభలో సవాల్ విసిరారు.
ప్రపంచం ముందు బైడెన్ తనను తాను నిరూపించుకునే అవకాశం ఇస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తనతో గోల్ఫ్ ఆడేందుకు రావాలంటూ 81 ఏళ్ల బైడెన్‌కు 78 ఏళ్ల ట్రంప్ సవాల్ విసిరారు. గోల్ఫ్ మ్యాచ్‌ను అధికారికంగా సవాలు చేస్తున్నానని, బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్ డాలర్లు విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈసారి పోటీ తనకు, బైడెన్‌కు నేరుగా ఉంటుందని, దీనికి ఎలాంటి అడ్డంకులు లేవని, ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమని ట్రంప్ స్పష్టం చేశారు. మ్యాచ్ ఎక్కడ జరగాలో మీరు చెప్పాలని బైడెన్‌కు ట్రంప్ సవాల్ విసిరారు.
ఆటలు ఆడేందుకు బైడెన్ ఖాళీగా లేరు
అయితే ఈ సవాల్‌ను బైడెన్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పే సమయం బైడెన్‌కు లేదని తెలిపాయి. బైడెన్ అమెరికాను నడిపించడంలో, స్వేచ్ఛా ప్రపంచాన్ని రక్షించడంలో బిజీగా ఉన్నారని, ఈ ఆటలకు ఖాళీగా లేరన్నారు. ట్రంప్ అబద్ధాలకోరని, దోషి, మోసగాడని, ఆయనకు ఇలాంటివి తప్ప వేరే పనే లేదని బైడెన్ ప్రతినిధులు విమర్శించారు.
బైడెన్‌కు ఆమె బీమా పాలసీ లాంటిది
మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హారిస్‌ను బైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమొక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వంకర బుద్ధి బైడెన్‌ను ఓ విషయంలో మెచ్చుకోవచ్చని అన్నారు. కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం ఆయన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని ట్రంప్ అన్నారు. బైడెన్‌కు ఇదే బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చన్నారు. కమలా హారిస్‌కు ప్రభుత్వంలో రెండు కీలక అంశాలు అప్పజెప్పారని ట్రంప్ చెప్పారు. వీటిల్లో ఒకటి బోర్డర్ సెక్యూరిటీ కాగా, రెండోది ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడమని పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదన్నారు.
పెరుగుతున్న డిమాండ్లు
జూన్ 27న అట్లాంటాలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆ తర్వాత సొంత పార్టీ సహచరులు కూడా బైడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ డిమాండ్లు మరింత పెరిగాయి. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని వస్తున్న డిమాండ్లను బైడెన్ తిరస్కరించారు. ఇప్పటికే బైడెన్ అధ్యక్ష పదవికి అర్హుడు కాదని తేలిపోయిందని కూడా ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ స్థానంలో కమలా హారిస్ పేరు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బలంగా వినిపిస్తోంది.
41ఏళ్లలో ఆస్ట్రియాకు తొలిసారి భారత ప్రధాని- ఇరు దేశాల మధ్య బాండింగ్ ఫుల్ స్ట్రాంగ్ అన్న మోదీ! - PM Modi Foreign Tour
'బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు'- పుతిన్‌కు ప్రధాని మోదీ పిలుపు! - Modi Russia Visit