Trump On Musk Job Email : ఫెడరల్ ఉద్యోగులు చేసే పనిపై వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయాలని గడువు విధిస్తూ డోజ్ విభాగాధిపతి ఎలాన్ మస్క్ చేసిన మెయిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. మస్క్ మెయిల్‌కు బదులివ్వకపోతే వారిని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లేనని స్పష్టం చేశారు.
'ఉద్యోగులు నిజంగా పనిచేస్తున్నారా లేదా అని మస్క్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే అవుతుంది. చాలామంది సమాధానమిచ్చేందుకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరు. ప్రభుత్వంలో వందల బిలియన్ డాలర్ల మేర జరుగుతున్న మోసాన్నిమస్క్ నేతృత్వంలోని డోజ్ గుర్తించింది. గతంలో విధుల్లో లేనివారికి కూడా జీతాలు ఇచ్చినట్లు తెలిసింది' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వ్యతిరేకిస్తున్న కీలక విభాగాలు
అయితే, మస్క్ గడువును కొన్ని కీలక ఫెడరల్ విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన ఆదేశాలకు స్పందించాల్సిన అవసరం లేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, తులసీ గబ్బార్డ్ సహా పలువురు తమ విభాగాల్లోని ఉద్యోగులకు స్పష్టం చేశారు. అటు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ కూడా దీనిపై స్పందించినట్లు సమాచారం. మస్క్ మెయిల్‌కు రిప్లై ఇవ్వనంత మాత్రాన ఎవరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించబోమని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
ఉద్యోగులకు రెండో అవకాశం
మరోవైపు తాజా పరిణామాలపై మస్క్ కూడా స్పందించారు. సోమవారం అర్ధరాత్రి లోపు రిప్లై ఇవ్వనివారికి రెండో అవకాశమిస్తానని వెల్లడించారు. అప్పుడు కూడా బదులివ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం తప్పదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ ఓ మెయిల్ పంపారు. ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు 5 వాక్యాల్లో ఉద్యోగులు ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆదేశించారు.