తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో టిక్​టాక్​ బ్యాన్​!- కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం - tiktok ban bill passed in america

Tiktok Banned in US : అమెరికాలో గత కొంతకాలంగా సాగుతున్న టిక్‌టాక్‌పై నిషేధానికి అడుగు పడింది. తాజాగా దీనికి సంబంధించిన బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

Tiktok Banned in US
Tiktok Banned in US

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 12:42 PM IST

Tiktok Banned in US :చైనాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా 352 మంది ఓటు వేయగా, 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఫలితంగా ఈ బిల్లు సెనేట్‌కు చేరనుంది. 'విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ' పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్‌ గల్లాఘే కలిసి రూపొందించారు.

"ఈ బిల్లు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించినది కాదు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్‌ గురించి. టిక్‌టాక్‌ యాజమాన్యం పూర్తిగా దాని చేతిలోనే ఉంది. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) అధీనంలో పనిచేస్తోంది. బైట్‌డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ CCPలో అత్యున్నత హోదాలో ఉన్నారు. అంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను CCP నియంత్రిస్తోంది. టిక్‌టాక్‌ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. కానీ, CCP నియంత్రణలో మాత్రం కాదు. అందుకే టిక్‌టాక్‌ నుంచి బైట్‌డ్యాన్స్‌ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలి. బిల్లులో ఈ అంశాలను మాత్రమే పొందుపర్చాం" అని కృష్ణమూర్తి వెల్లడించారు.

సీపీపీ నియంత్రణలోని టిక్‌టాక్‌ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మైక్‌ పెన్స్‌ అభిప్రాయపడ్డారు. సెనేట్‌ దీనికి వెంటనే ఆమోదం తెలిపి అధ్యక్షుడు బైడెన్‌కు పంపాలని సూచించారు. ఈ బిల్లు ఆమోదంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించబోతున్నట్లు కాదని మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ చెప్పారు. దేశ భద్రత, సమాచార గోప్యతను కాపాడేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మాత్రమే సూచిస్తోందని తెలిపారు. టిక్‌టాక్‌ వల్ల ప్రయోజనాలూ ఉన్నాయని, కానీ దాని అల్గారిథమ్‌, అందులో నిక్షిప్తమయ్యే సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లొద్దనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామని వెల్లడించారు.

తొలిదేశం భారత్
ప్రపంచంలో టిక్‌టాక్‌ను నిషేధించిన తొలి దేశం భారత్‌. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ, వ్యక్తులపై నిఘా పెడుతోందని గుర్తించిన ప్రభుత్వం 2020లోనే ఈ యాప్‌పై చర్యలు తీసుకుంది. ఆ తర్వాత పలు దేశాలూ అదే బాటలో నడిచాయి. అమెరికాలోనూ ట్రంప్ హయాంలో దీని నిషేధంపై చర్చ జరిగింది. తాజాగా ఆయన ఈ విషయంలో మాట మార్చారు. టిక్‌టాక్‌ నిషేధం వల్ల ఫేస్‌బుక్‌ అయాచిత లబ్ధి పొందుతుందనేది ఆయన వాదన. అయితే, తాజాగా ఆయన సొంత పార్టీ నుంచి మెజారిటీ సభ్యులు ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.

టిక్‌టాక్‌కు అమెరికాలో సుమారు 150 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. దీన్ని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ యాప్‌ వద్ద ఉన్న అమెరికన్ల సమాచారం చైనా దక్కించుకునే అవకాశం ఉందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో బైట్‌డ్యాన్స్‌ సంస్థ టిక్‌టాక్‌ను అమ్మేయాలని అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. లేదంటే దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. తాజాగా ఆ దిశగా రూపొందించిన బిల్లు ప్రతినిధుల సభలో నెగ్గింది.

ABOUT THE AUTHOR

...view details