Russian Secret Satellite :రష్యా రహస్యంగా ఓ కీలక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం అమెరికన్ ఇంటెలిజెన్స్ వద్ద ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై నిజాలను బయటపెట్టాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ మైక్ టర్నర్ బుధవారం డిమాండ్ చేశారు. దాని పర్యవసానాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ వార్తల్ని ట్రాక్ చేస్తున్నట్లు శ్వేతసౌధం గురువారం ధ్రువీకరించింది. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సామర్థ్యాన్ని రష్యా పొందిందని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉందని శ్వేతసౌథం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా అధికారులు విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపినట్లు జాన్ కిర్బీ వెల్లడించారు. తక్షణమే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు. దిగువ కక్ష్యలో ఉండే వ్యోమగాములకు సైతం ఇది ప్రమాదకరమన్నారు. అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసే సామర్థ్యం ఆ ఆయుధానికి ఉందని మాత్రం చెప్పలేమని కిర్బీ అన్నారు. దీని తయారీని కొన్ని నెలల క్రితమే రష్యా ప్రారంభించిందన్నారు. ఏళ్లుగా దీనిపై పని జరుగుతోందంటూ వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. రష్యా తయారు చేస్తున్న ఆయుధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బైడెన్‌కు తెలియజేశామని చెప్పారు. ఈ సమాచారాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకోవాలని ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ విషయంపై నేరుగా రష్యాతోనూ చర్చించాలని అధ్యక్షుడు బైడెన్ తమను ఆదేశించినట్లు వివరించారు.
మరోవైపు, ప్రస్తుతానికి రష్యా కొత్త ఆయుధం వల్ల ముప్పులేదని, అది యాక్టివ్‌గా లేదని, ఇంకా ఆ ఆయుధాన్ని రష్యా మోహరించలేదని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ వెల్లడించారు. ఇది ఉపగ్రహ విధ్వంసక క్షిపణికి సంబంధించిన అంశమని తెలిపారు. ఒకవేళ మాస్కో అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధాన్ని అంతరిక్షంలోకి పంపితే అది చాలా ప్రమాదకరమని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ స్పేస్ అండ్ డిఫెన్స్ బడ్జెట్ నిపుణుడు టాడ్ హారిసన్ తెలిపారు. భూదిగువ కక్ష్యలో అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఉపగ్రహాలన్నీ దెబ్బతింటాయని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సైతం ప్రభావితమవుతుందన్నారు. దానిలోని వ్యోమగాములకూ ముప్పు తప్పదని వివరించారు. రోదసిలో పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.