తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండియన్​ మూవీస్​ అంటే ఎంతో ఆసక్తి- రష్యాలో 'బ్రిక్స్​' మ్యూజిక్ ఫెస్టివల్: పుతిన్ - PUTIN ON INDIAN MOVIES

భారతీయ చిత్రసీమపై పుతిన్ ప్రశంసలు- రష్యాలో ఇండియన్ మూవీస్​కు మంచి ఆదరణ ఉందన్న అధ్యక్షుడు

Putin On Indian Movies
Putin On Indian Movies (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 7:25 AM IST

Putin On Indian Movies :రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌ భారతీయ చిత్రసీమపై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ ఉందని తెలిపారు. ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి బ్రిక్స్ సమవేశాలు ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనున్న నేపథ్యంలో పుతిన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్‌ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్‌ సమాధానమిచ్చారు.

"భారతీయ చలన చిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది. మా దేశంలో 24 గంటలు కూడా ఇండియన్‌ మూవీస్‌ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్‌ కూడా ఉంది. మాకు భారతీయ చిత్రాలు అంటే ఎంతో ఆసక్తి. మేం బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాం. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ ఏడాది బ్రిక్స్‌ దేశాలకు చెందిన చలన చిత్రాలను కూడా ప్రదర్శించనున్నాం. ఇండియన్‌ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి మేం సానుకులంగా ఉన్నాం. వారి చిత్రాలను ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఫార్మా రంగానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలపై భారత ప్రధాని మోదీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు"
- పుతిన్, రష్యా అధ్యక్షుడు

భారత ప్రధాని మోదీతో కజన్‌లో ఈ విషయంపై మాట్లాడతానని తెలిపారు పుతిన్. ఈ ప్రతిపాదన ముందుకు వెళ్తుందని 100 శాతం నమ్మకం ఉందని చెప్పారు. భారత్‌తో పాటు బ్రిక్స్‌ కూటమిలోని ఇతర దేశాల చిత్రాల సంస్కృతులు, నటులను చూడడం చాలా మనోహరంగా ఉంటుందని వెల్లడించారు. థియేట్రికల్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయాలని బ్రిక్స్‌ కూటమి సభ్యులం చర్చించుకున్నామన్నారు. సినిమా అకాడమీని ఏర్పాటు చేశామని పుతిన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్రిక్స్‌ కూటమి దేశాలతో కలిసి మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు, బ్రిక్స్‌ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదని, కేవలం పశ్చిమయేతర కూటమి అని పుతిన్‌ స్పష్టం చేశారు. బ్రిక్స్‌ సభ్యదేశమైన భారత్‌ వైఖరి కూడా ఇదేనని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇది కష్టమైనప్పటికీ సాధ్యమేనన్నారు. ఆ రెండు దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details