Russia Nuclear Weapons: అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు రష్యా పూర్తి వ్యతిరేకమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అణ్వస్త్ర ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను పుతిన్ ఖండించారు. అమెరికాకు సమానంగా అంతరిక్ష సామర్థ్యాలను మాత్రమే తమ దేశం అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.
రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో నిర్వహించిన సమావేశంలో పుతిన్- అమెరికా చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్ని రష్యా ఎప్పటికీ సమర్థించదని తెలిపారు. కొన్ని దేశాలు కావాలనే తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్యదేశాలను ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించామని, కానీ కొన్నిదేశాలు ముందుకు రాలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు.
రష్యా సీక్రెట్ ఆయుధం
ఇటీవలే రష్యా రహస్యంగా ఓ కీలక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం అమెరికన్ ఇంటెలిజెన్స్ వద్ద ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై నిజాలను బయటపెట్టాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ మైక్ టర్నర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సామర్థ్యాన్ని రష్యా పొందిందని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉందని శ్వేతసౌథం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఈ అంశంపై మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.