తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రేడ్​ & టెక్​ యుద్దాల్లో విజేతలు ఉండరు: జిన్‌పింగ్‌ - US CHINA TRADE WAR

చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు - ట్రంప్​నకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కౌంటర్​!

Trump vs Xi jinping
Trump vs Xi jinping (AP)

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 5:11 PM IST

US China Trade War : చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దీటుగా స్పందించారు. చైనా-అమెరికా మధ్య టారిఫ్‌, ట్రేడ్​, టెక్‌ యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కచ్చితంగా పరిరక్షించుకుంటామని చైనా అధ్యక్షుడు ఉద్ఘాటించారు.

"టారిఫ్‌ వార్‌, ట్రేడ్‌ వార్‌, టెక్నాలజీ వార్‌ అనేవి చారిత్రక పోకడలకు, ఆర్థిక చట్టాలకు విరుద్ధంగా నడుస్తాయి. వీటిలో విజేతలు అంటూ ఎవరూ ఉండరు" అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. వరల్డ్‌ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి 10 అంతర్జాతీయ సంస్థల అధినేతలతో భేటీ సందర్భంగా జిన్‌పింగ్‌ ఈ విధంగా మాట్లాడారు. తమ దేశ సొంత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడం సహా, భద్రత, అభివృద్ధి, సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.

చైనా ఆర్థిక మందగమనంపై మాట్లాడిన జిన్‌పింగ్‌, ఈ ఏడాది 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని సాధిస్తామనే విశ్వాసం తమకు ఉందన్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధిలో చైనా కీలక పాత్ర పోషించడాన్ని కొనసాగిస్తుందన్నారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సొంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, బహిరంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్రంప్‌తో సంభాషణ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చైనా అధ్యక్షుడితో ట్రంప్‌ మాట్లాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై ట్రంప్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడితో మంచి సంభాషణ జరిగిందని, జిన్‌పింగ్‌ చాలా బాగా కలసిపోయారని చెప్పారు. అయితే, చైనా మాత్రం వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిన విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

సుంకాలు పెంచుతా!
తాను అధికారంలోకి వస్తే చైనా ఎగుమతులపై 60శాతం సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఫెంటానిల్‌ను అరికట్టడంలో చైనా విఫలమైతే అదనంగా మరో 10శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీనితో చైనా కూడా దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. గుత్తాధిపత్య నిరోధక చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడినట్లు అనుమానిస్తూ అమెరికాకు చెందిన చిప్‌తయారీ సంస్థ ఎన్‌విడియాపై దర్యాప్తు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. చైనా చిప్‌ తయారీ రంగంపై అమెరికా ఆంక్షలకు ప్రతీకారంగానే చైనా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details