PM Modi To Attend G20 Summit :ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. తొలుత ప్రధాని మోదీ నైజీరియాకు వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు.
జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ - మూడు దేశాల పీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు - PM MODI TO ATTEND G20 SUMMIT
మోదీ 3 దేశాల పర్యటన షెడ్యూల్ ఖరారు - బ్రెజిల్ సహా నైజీరియా, గయానాలో పర్యటించనున్న ప్రధాని
Published : Nov 12, 2024, 10:33 PM IST
ఆ తరువాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బ్రెజిల్‌కు పయనమవుతారు. ఈ నెల 18, 19వ తేదీల్లో బ్రెజిల్లో పర్యటించనున్నారు. "జీ-20 సదస్సు సందర్భంగా వివిధ ప్రపంచ అంశాలపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ చాటిచెబుతారు. ‘జీ-20 దిల్లీ డిక్లరేషన్’, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ల ఫలితాలను కూడా విశ్లేషించనున్నారు" అని విదేశాంగశాఖ తెలిపింది. సదస్సు సందర్భంగా పలువురు నేతలతోనూ మోదీ భేటీ కానున్నట్లు సమాచారం.
బ్రెజిల్ సందర్శన ముగించుకుని 19వ తేదీన ప్రధాని గయానాకు వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు 21వ తేదీ వరకు అధికారిక పర్యటన కొనసాగనుంది. 17 ఏళ్లలో నైజీరియాలో, 1968 తర్వాత గయానాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.