PM Modi Austria Visit: భారత్-ఆస్ట్రియా మధ్య స్నేహబంధం దృఢంగా ఉందని, రానున్న కాలంలో మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత్- ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీకి కార్ల్ నెహమ్మర్ విందు ఇచ్చారు.
అంతకుముందు వియన్నాకు చేరుకున్న ప్రధాని మోదీని కార్ల్ నెహమ్మర్ కౌగిలించుకున్నారు. అలాగే ప్రధానితో సెల్ఫీ సైతం దిగారు. "ప్రధాని మోదీకి స్వాగతం. మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆస్ట్రియా- భారత్ మిత్ర దేశాలు. ఇరుదేశాల మధ్య బలమైన చర్చలు కోసం ఎదురుచూస్తున్నా" అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
41ఏళ్ల తర్వాత ఆస్ట్రియాకు
రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాగా, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు.
కాగా, ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. "భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రధాని మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ వ్యక్తిగత ఆతిథ్యం ఇచ్చారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య మొదటి సమావేశం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగుతున్నాయి." అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.