PM Modi AI Summit :కృత్రిమ మేధస్సు(AI)పై అంతర్జాతీయ స్థాయిలో విధివిధానాలు, ప్రమాణాల రూపకల్పన దిశగా ప్రపంచ దేశాలు ఉమ్మడి కృషి చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ నిర్వహణతో ముడిపడిన నైతిక నియమావళి, ఆ సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడంపై విలువైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మంగళవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 'ఏఐ యాక్షన్ సదస్సు'కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి సహ-సారథ్యం వహిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. 'ఏఐ' సాంకేతికతను ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లో ఉన్న దేశాలకు అందేలా చూడాలన్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా, నైపుణ్యాలపరంగా, ఇంధనవనరుల పరంగా వెనుకంజలో ఉన్న ఆయా దేశాలకు దన్నుగా నిలవాలని భారత ప్రధాని కోరారు.
'మేం (భారత్) సొంతంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను మా దేశంలోని స్టార్టప్‌లు, పరిశోధకులకు చౌక ధరకు అందిస్తాం. మా దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మోదీ వెల్లడించారు.
ఓపెన్ సోర్స్ AI వ్యవస్థలు కావాలి
మానవజాతి భవిష్యత్ నిర్మాణంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మోదీ. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఏఐ ఉషోదయాన్ని కళ్లారా చూస్తోందని పేర్కొన్నారు. ఈ శతాబ్దంలో మానవ సమాజపు కోడ్‌ను ఏఐ రాస్తోందని కితాబిచ్చారు. 'మిగతా సాంకేతికతల కంటే ఏఐ భిన్నమైంది. అనూహ్య వేగంతో ఇది వికసిస్తోంది. వేగంగా దీన్ని అందరూ అందిపుచ్చుకుంటున్నారు. దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా దీని వినియోగం జరుగుతోంది' అని మోదీ తెలిపారు. ఏఐ వల్ల రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయని ప్రధాని చెప్పారు.