Pakistan Elections 2024 :ఆర్థిక సంక్షోభం, బాంబు పేలుళ్లు, పెచ్చుమీరుతున్న హింస, రాజకీయ కక్షలు వంటి పరిణామాల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు పాకిస్థాన్ ప్రజలు సిద్ధమయ్యారు. దేశ సైన్యం కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు గురువారం ఓటేయనున్నారు. ఆర్మీ అండదండలు ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, ఆ పార్టీకి ఉన్న ఎన్నికల గుర్తు రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి గెలిస్తే నాలుగోసారి పాక్ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తిగా నవాజ్ షరీఫ్(74) రికార్డు సృష్టించినట్లవుతుంది. బ్యాటు గుర్తు కోల్పోయిన నేపథ్యంలో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. మరోవైపు, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సైతం ఎన్నికల బరిలో ఉంది.
12.85 కోట్ల ఓటర్లు
పాకిస్థాన్లో మొత్తం 12.85 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. ప్రజలు ఓటేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఎన్నికల నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. భద్రత కోసం 6.50 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. బుధవారం బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.