Blast at Pakistan Railway station :పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌పై శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 14మంది భద్రతాసిబ్బంది ఉన్నట్లు చెప్పారు. మరో 62 మంది గాయపడినట్లు వెల్లడించారు. ప్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు పెషావర్‌కు బయలుదేరుతుండగా పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయంలో దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు క్వెట్టా డివిజన్ కమిషనర్ హంజా సఫ్తాక్ తెలిపారు. దుండగుడు లగేజ్‌తో రైల్వే స్టేషన్లోకి వచ్చాడని చెప్పారు. అయితే ఆత్మాహుతి దాడి చేయడానికి వచ్చే వారికి నిలువరించడం కష్టమని అన్నారు. కాగా, పేలుడు ధాటికి ప్లాట్‌ఫామ్ పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు శబ్ధం నగరంలోని వివిధ ప్రాంతాలకు వినిపించింది.
ఈ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఈ ఘటనస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరులే లక్ష్యంగా దుండగులు భయానక దాడి చేశారని అన్నారు. ఈ పేలుడుపై తక్షణ విచారణకు ఆదేశించారు. పౌరులు, కార్మికులు, మహిళలు, పిల్లలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
'దాడి చేసింది మేమే'
ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ- బీఎల్ఏ బాధ్యత వహించింది. బీఎల్ఏను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలూచిస్థాన్‌లోని వనరులను పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం దండుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. వీటిని పాక్ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇక్కడి వారితో కలిసి విదేశీ శక్తులు చేస్తున్న కుట్రగా అభివర్ణించింది.