Nobel Prize In Physics 2024 :ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం జాన్ జె.హాప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌ను వరించింది. మెషీన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్‌వర్క్ ఆవిష్కరణ కోసం వీరిరువురూ చేసిన కృషికి గాను ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది.
హాప్‌ఫీల్డ్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో తన పరిశోధనలు చేయగా, హింటన్ టొరంటో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేశారు. వీరు మెషీన్ లెర్నింగ్‌లో విశేషమైన కృషి చేశారు. వీరికి నోబెల్ ప్రైజ్ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌లు (1 మిలియన్ అమెరికన్ డాలర్ల) అందిస్తారు. 1901 నుంచి ఇప్పటి వరకు మొత్తం 117 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించగా, 224 మంది దీనిని స్వీకరించారు.
ముచ్చటగా ముగ్గురు
గతేడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. పరమాణువుల్లోని (Atoms) ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు, కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి నోబెల్ పురస్కారాన్ని అందజేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.