Muhammad Yunus To Be Chief Adviser Of Interim Govt In Bangladesh :బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి సంబంధించి విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కీలక ప్రతిపాదన చేసింది. కొత్త ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్‌ను నియమించాలని డిమాండ్ చేసింది.
రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నడిపిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం మంగళవారం తెల్లవారు జామున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో "దేశాన్ని రక్షించాలనే విద్యార్థి సంఘం పిలుపు మేరకు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించారు. మధ్యంతర ప్రభుత్వ రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై 24 గంటల్లోగా ప్రతిపాదనలు ఇస్తామని చెప్పాం. అందుకు అనుగుణంగానే దేశ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆ ప్రతిపాదనలను వెల్లడిస్తున్నాం' అని ఆ వీడియోలో నహీద్ పేర్కొన్నారు.
ఆయనకు ఆమోదయోగ్యత ఉంది!
‘‘అంతర్జాతీయంగా ఖ్యాతి కలిగిన ముహమ్మద్ యూనస్‌ను ప్రధాన సలహాదారుడిగా నియమించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యత ఉంది. అటువంటి వ్యక్తికి ఆ కీలక స్థానం దక్కాల్సిందే’’ అని నహీద్ తెలిపారు. ముహమ్మద్ యూనస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని నహీద్ కోరారు. ఈ వీడియో సందేశంలో నహీద్ వెంట మరో ఇద్దరు ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కోఆర్డినేటర్లు కూడా కనిపించారు.