New York Earthquake Today : అమెరికాలోని న్యూయార్క్‌లో 4.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. బ్రూక్లిన్‌లోని భవనాలు కంపించాయని వాటిలోని అద్దాలు ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెలుగుచూశాయి.
న్యూజెర్సీలోని వైట్‌హౌస్ స్టేషన్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామనీ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మన్‌హట్టన్, బ్రూక్లిన్లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల వారు సైతం ప్రకంపనలను గుర్తించినట్టు వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని న్యూయార్క్ నగర అత్యవసర సేవల విభాగం పేర్కొంది. ఐరాస భద్రతా మండలి సమావేశానికి భూకంపం కారణంగా స్పల్ప ఆటంకం ఏర్పడింది.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో భూమి కంపించింది. ఈ నేపథ్యంలో సభ్యులు గందరగోళానికి గురయ్యారు. అది భూకంపమా అని మండలిలో ప్రశ్నిస్తున్న సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధి జాంటీ సోరిప్టో వ్యాఖ్యానించడం కనిపించింది. భూకంపాన్ని 42 మిలియన్ల మంది అమెరికన్లు అనుభూతి చెందినట్లు USGS వెల్లడించింది