Netanyahu On Israel Hamas War :లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్‌బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్‌బొల్లా నుంచి రోజువారీ రాకెట్ దాడులను సహించే ప్రసక్తే లేదని తెలిపారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన, ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామని చెప్పారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని అన్నారు.
"90 శాతం మంది హమాస్ రాకెట్లను నాశనం చేశాం. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశాం. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతాం. మా పౌరులను సురక్షితంగా వారి నివాసాలకు తిరిగి వచ్చేలా చూసే హక్కు మాకుంది. అదే పని మేం చేస్తున్నాం. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్‌బొల్లాపై పోరాటం కొనసాగిస్తాం. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నాం. అయినప్పటికీ ఇక జరిగింది చాలు అని చెప్పేందుకే ఇక్కడకు వచ్చాను" అని ఐరాస వేదికగా బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
అది ఆపాల్సిందే!
గతేడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ మెరుపుదాడి అనంతరం ప్రతిస్పందనను నెతన్యాహు సమర్థించుకున్నారు. ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ, తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే వచ్చానన్నారు. ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటుదని తెలిపారు. అనేక సమస్యలకు ఇరాన్ ముఖ్య కారణమని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని, దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.