South Korea Plane Crash Reason :దక్షిణ కొరియా ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ క్రమంలో విమాన ప్రమాదానికి గల కారణాలేంటి? అధికారులు ఏం చెబుతున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రమాదానికి కారణం ఏమిటి?
విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు ఫెయిల్ అయ్యాయని కొందరు, పక్షిని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందుకు బలం చేకూర్చేలా విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఓ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
ల్యాండింగ్ గేర్ వైఫల్యం
విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగా, బెల్లీ ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. విమానం పొట్ట భాగం రన్‌వేపై ఉంది. దీంతో ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా తెరుచుకోకపోవడం వల్ల పైలట్ ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
అయితే యోన్ హాప్ నివేదిక ప్రకారం, 'సాధారణ ల్యాండింగ్ విఫలం కావడం వల్ల పైలట్ క్రాష్ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. విమానాన్ని అంతకు ముందే పక్షి ఢీకొని ఉండొచ్చు. పక్షి ఢీకొన్న తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం, బెల్లీ ల్యాండింగ్ ప్రమాదానికి కారణమయ్యాయి. విమానం ల్యాండింగ్ గేర్, టైర్లు వంటివి యాక్టివేట్ కాలేదు'
నిర్లక్ష్యమే కారణమా?
అయితే పలువురు నెటిజన్లు విమానాశ్రయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 కిమీ కంటే తక్కువ పొడవు ఉన్న రన్‌వేపై బెల్లీ ల్యాండింగ్ జరిగితే, అగ్నిమాపక సిబ్బంది ఎందుకు పొజిషన్ తీసుకోలేదని ప్రశ్నించారు. విమానం బెల్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు ఎలాంటి చక్కర్లు కొట్టలేదని మరొకరు ప్రశ్నించారు.
'విచారణ తర్వాత కారణాలు వెల్లడిస్తాం'
ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితులు కారణంగా విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ హైయూన్ తెలిపారు. ఉమ్మడి విచారణ తర్వాత ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, జరిగిన ప్రమాదానికి థాయ్ లాండ్కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది.