Moscow Concert Hall Attack : మాస్కోలోని అతి పెద్ద సంగీత కచేరీ హాలులో జరిగిన దాడికి కారణమైన వారిని వదిలి పెట్టేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే దేశవ్యాప్తంగా మార్చి 24న సంతాపదినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడి నేపథ్యంలో జాతినుద్దేశించి పుతిన్ ఈ విధంగా ప్రసంగించారు.
మార్చి24న సంతాపదినం
'రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద దాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటిస్తున్నా. తాజా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టాం. ఈ ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న నలుగురితోపాటు 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాం. అయితే ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందింది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన కొందరు సహకరించారు.ఈ దాడికి కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్ హస్తముందన్న రష్యా!
ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని, దాడుల అనంతరం ఆ దేశం వైపు వెళ్లేందుకు యత్నించారని రష్యా భద్రత ఆరోపించింది. అయితే తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్ ఖండించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించుకుంది.