Israel Missile Strike : హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ ప్రాంతం సహా మరోచోట వైమానిక దాడులు చేసింది. హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీం సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే హషీం పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు సైనిక పరిశ్రమలే లక్ష్యంగా దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.
'ఇజ్రాయెల్‌ను అమెరికా ఒక సాధనంగా వాడుకొంటోంది'
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లాఅలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని శపథం చేశారు. ఇజ్రాయెల్‌ను అమెరికా ఒక సాధనంగా వాడుకొని పశ్చిమాసియాలోని భూములు, వనరులపై నియంత్రణ కోసం యత్నిస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్‌పై పోరాటం చేస్తున్న పాలస్థీనా, లెబనాన్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. టెహరాన్‌లో జరిగిన శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"హమాస్, హెజ్‌బొల్లాలపై ఇజ్రాయెల్ ఏ విధంగానూ విజయం సాధించదు. సయ్యద్ హసన్ నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన బలిదానం వృథా కాదు. శత్రువు ప్రణాళికలను భగ్నం చేస్తాం. వారికి వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలి" అని సుప్రీం లీడర్ ఖమేనీ పిలుపునిచ్చారు.