Male Birth Control Gel :గర్భం నివారణ కోసం ప్రస్తుతం పురుషులకు కండోమ్‌లు, వేసెక్టమీ శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికంటే ప్రభావంతమైన పద్ధతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జిగురు ద్రవం (జెల్) రూపంలో ఉండే ఓ క్రీమ్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని భుజాలపై రాసుకోవడం వల్ల వారాల వ్యవధిలో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందట. గర్భ నివారణకు సంబంధించిన పురుషుల కోసం ఇది మరో మంచి ఆప్షన్ అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు NES/T అనే జెల్‌పై చేసిన పరిశోధన వివరాలను ఆదివారం వెల్లడించారు.
NES/T అంటే నెస్టోరోన్, టెస్టొస్టెరాన్ అనే రెండు ప్రధాన పదార్థాల కలయిక. గర్భం, ఇతర పునరుత్పత్తి విధులను నిర్వర్తించే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ సింథటిక్ వెర్షనే ఈ నెస్టోరోన్. మహిళల్లో గర్భ కారక హార్మోన్ల నియంత్రణకు ఈ నెస్టోరోన్ వంటి ఔషధాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఔషధాన్ని పురుషులకు ఇచ్చినప్పుడు, వృషణాల్లో ఉన్న టెస్టోస్టిరాన్ వంటి సంతానోత్పత్తి హార్మోన్ల లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈ ఔషధం రక్తంలో ఉన్న టెస్టోస్టిరాన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది పురుషుల్లో సెక్స్ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ నెస్టోరోన్ ఔషధం పురుషులకు ఇవ్వడం ద్వారా మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
అయితే పురుషుల రక్తంలో హార్మోన్ లెవెల్స్‌ను నిలకడగా ఉంచడానికి, జెల్ ద్వారా టెస్టోస్టెరాన్ను ప్రవేశపెట్టడం ద్వారా తాత్కాలికంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలతో కలిసి అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ (NICHD) ఈ జెల్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ NES/T జెల్‌పై ఫేజ్ 2బీ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ట్రయల్ ఇంకా పూర్తి కాకముందే, అందుబాటులో ఉన్న డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ జెల్ ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
NICHD గర్భనిరోధక అభివృద్ధి కార్యక్రమం చీఫ్ డయానా బ్లైత్, ఆమె బృందం ఈ జెల్ ఎంత సమయంలో ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని పరిశీలించారు. ఈ జెల్ చాలా మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను 12 నుంచి 15 వారాల్లో సమర్థంగా తగ్గించే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే చాలా మందిలో చాలా తక్కువ సమయంలో వీర్యకణాల సంఖ్య తగ్గిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రయల్స్‌లో పాల్గొన్న 222 మందికి ట్రీట్మెంట్ ప్రారంభించిన 15 వారాల్లోపు 86శాతం స్పెర్మ్ కౌంట్ తగ్గిందని తెలిపారు. ఐదు వారాల్లో 20శాతం, 8వారాల్లో 52శాతం, 9వారాల్లో 62శాతం స్పెర్మ్ కౌంట్ తగ్గిందని వెల్లడించారు.
అయితే ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం పడుతుంది. కానీ బ్లైత్, ఆమె బృందం మాత్రం ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియ గురించి చర్చించడానికి బ్లైత్ బృందం వచ్చే ఏడాది ఎఫ్‌డీఏతో సమావేశం కానుంది. మరోవైపు, ఈ జెల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి వాణిజ్య భాగస్వామి కోసం బ్లైత్ బృందం వెతుకుతోంది. కాబట్టి పురుషులు సులభంగా, సమర్థంగా సంతానోత్పత్తి నియంత్రణ పొందేందుకు మరి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.