తెలంగాణ

telangana

ETV Bharat / international

'సివిల్​ డ్రస్సుల్లోనూ ఉండొద్దు'- భారత సైనికులపై మయిజ్జు మరోసారి అక్కసు - maldives china relations

Maldives President On Indian Troops : భారత్‌ను వ్యతిరేకించే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మనకు పక్కలో బల్లెంలా ఉన్న చైనాతో సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల్లోని భారత్‌ బలగాలపై మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన సైనికులు మాల్దీవుల్లో సైనిక దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లో కూడా ఉండరని స్పష్టం చేశారు.

Maldives President On Indian Troops
Maldives President On Indian Troops

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 5:09 PM IST

Maldives President On Indian Troops : భారత్‌తో వివాదం వేళ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరోసారి ఇండియాపై వ్యతిరేక గళం వినిపించారు. మే 10 తర్వాత తమ దేశంలో భారత్‌ సైనికులు సైనిక దుస్తుల్లోనే కాదు, సాధారణ దుస్తుల్లో కూడా ఉండరని ముయిజ్జు మీడియాకు తెలిపారు. బా అటోల్‌లో జరిగిన పర్యటనలో పాల్గొన్న ముయిజ్జు, తమ దేశం నుంచి భారత్‌ బలగాల ఉపసంహరణలో విజయం సాధించినట్లు వెల్లడించారు. దీనిపై తప్పుడు వదంతులను సృష్టించి, పరిస్థితులను వక్రీకరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మాల్దీవులతో ఒప్పందంలో భాగంగా భారత సాంకేతిక బృందం గతవారం ఆ దీవులకు చేరుకుంది. దీనిపై కొన్ని విపక్షాలు సైనికులే తమ దుస్తులను మార్చుకొని సాధారణ దుస్తుల్లో వస్తున్నారన్న అనుమానాల రేకెత్తించాయి. దీనిపై స్పందించిన ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్‌ ఘాసన్‌తో చైనా మేజర్‌ జనరల్‌ జాంగ్‌ బావోకున్‌ సోమవారం మాలెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వివరాలను రెండు దేశాలు బయటకు వెల్లడించనప్పటికీ ఈ సైనిక సహకారాన్ని చైనా ఉచితంగా అందించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భారత్​- మాల్దీవుల వివాదం
కొన్నాళ్లుగా భారత్​-మాల్దీవుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధాని మోదీ అక్కడ సముద్ర తీరంలో ఇటీవలే విహరించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు స్నార్కెలింగ్‌ అనే సాహస స్మిమ్మింగ్‌ చేసి సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు మోదీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్‌(ట్విట్టర్​) ఖాతాలో షేర్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో లక్షదీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయని రాసుకొచ్చారు. దీనిపై మాల్దీవులు ముగ్గురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్​ను అవమానించేలా పోస్టులు చేశారు. దీంతో ఆ ద్వీప దేశంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల్లో పర్యటించొద్దని ఇంటర్నెట్​ను హోరెత్తించారు. దీనికి సెలబ్రెటీలు సైతం మద్దతు పలికారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

'ఆ లోపు మా దేశాన్ని ఖాళీ చేయండి'- భారత్​కు మాల్దీవులు అధ్యక్షుడి డెడ్​లైన్​!

పర్యటకులను పంపాలని చైనాకు మాల్దీవులు విజ్ఞప్తి- భారత్​పై మరోసారి బయటపడిన డ్రాగన్​​ వక్రబుద్ధి

ABOUT THE AUTHOR

...view details