Israel Ceasefire Update :నెదర్లాండ్స్ హేగ్‌లోని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌కు తాత్కాలిక ఊరట లభించింది. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌ను UN కోర్టు ఆదేశిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ ఆ ఆదేశాన్ని నిలిపివేసింది. అయితే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది.
గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని సృష్టిస్తోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇప్పుడే నిర్ణయాన్ని వెల్లడించలేమని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. ప్రపంచంలోని అత్యంత అపరిష్కృతమైన సంఘర్షణలలో ఒకటైన ఈ కేసులో ప్రాథమిక నిర్ణయంలో భాగంగా గాజాలో సైనిక దాడికి ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను ఆపాదించకూడదని UN అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. 17 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గాజాలో ప్రాణ నష్టం గురించి తమకు తెలుసన్న అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షులు జోన్ ఇ.డోనోగ్యు ఆ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత నిర్ణయం కేవలం మధ్యంతరమనీ దక్షిణాఫ్రికా తీసుకువచ్చిన పూర్తి కేసును పరిగణనలోకి తీసుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని పేర్కొన్నారు. గాజాలో నరమేధం చేస్తున్నట్టు తమపై దక్షిణాఫ్రికా చేస్తున్న ఆరోపణలను కొట్టివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్నిఇజ్రాయెల్ కోరింది. మరోవైపు ఈ కేసు విచారణకు వచ్చిన క్రమంలో గాజాలో పరిస్థితిని అత్యవసర అంశంగా భావించి పాలస్తీనా ప్రజల్ని కాపాడేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా కోరింది.