India On Canada :ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంటులో కెనడా ప్రత్యేకంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యలందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా నిజ్జర్ జ్ఞాపకార్థం మౌనం పాటించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ తెలిపారు.
2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగింది. ఈ ఘటన వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఏ ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా సర్కారు నలుగురు భారతీయులను అరెస్టు చేసింది.
భారత్ గట్టి కౌంటర్
అటు నిజ్జర్‌కు నివాళి ఆర్పించిన వ్యవహారంలో కెనడాకు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్థాని ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన 329 మందికి ఈనెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈనెల 23 నాటికి బాంబు దాడి జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారకసభను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ముందు ఉండటంతో పాటు ఈ విషయంలో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.