PM Modi About Asean-India Links :భారత్-ఆసియాన్ మధ్య సమగ్ర భాగస్వామ్య బలోపేతానికి 10 సూత్రాల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆసియా భవిష్యత్తు బాగుంటాలంటే, ఈ ప్రాంతీయ దేశాల కూటమితో సంబంధాలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో గురువారం జరిగిన 21వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో భారత్-ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అయ్యి 130 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. భాగస్వామ్య ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వస్తు వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. నలంద విశ్వవిద్యాలయంలో చేరే ఆసియాన్ దేశాల విద్యార్థుల ఉపకార వేతనాల సంఖ్యను రెట్టింపు చేస్తామని స్ఫష్టం చేశారు. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ఆసియాన్ దేశాల విద్యార్థుల కోసం కొత్త నిధులు కూడా అందిస్తామన్నారు.
21వ శతాబ్దం ఆసియా దేశాలదే!
"21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా భావిస్తున్నాను. ఈ శతాబ్దం భారత్, ఆసియా దేశాలదే" అని ఆసియాన్ దేశాలైన మలేసియా, థాయ్‌లాండ్, బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, లావోస్, సింగపూర్ నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆసియాన్ దేశాలతో భారత్‌కు గల చారిత్రక సంబంధాలు ఊపందుకోవడానికి, వాటి మధ్య నూతన శక్తి, దిశలను నిర్దేశించిన యాక్ట్ ఈస్ట్ పాలసీ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకొంటోందని అన్నారు.