Houthi Rebels Attack Ship :గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హూతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. బుధవారం బార్బడోస్ జెండాతో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణితో భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఆరుగురు గాయపడ్డారని అమెరికా తెలిపింది.
క్షిపణి దాడి జరగడం వల్ల ఓడలోని మిగతా సిబ్బంది వెంటనే అందులో నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. అమెరికా యుద్ధనౌక, భారత నేవీ వారికి లైఫ్ బోట్ల ద్వారా సాయం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హూతీలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
దాడులను తిప్పికొట్టిన అమెరికా
Houthi Rebels Attack US Ships : అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై ఇటీవలే హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురు దాడి చేసి యెమెన్ భూభాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.