తెలంగాణ

telangana

ETV Bharat / international

'WHOకు మా మద్దతు కొనసాగుతుంది' - ట్రంప్ యాక్షన్​కు చైనా రియాక్షన్​! - US WHO WITHDRAWAL

డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ - WHOకు పూర్తి మద్దతు ప్రకటించిన చైనా

US WHO Withdrawal
US WHO Withdrawal (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 6:40 PM IST

US WHO Withdrawal :ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసిన డబ్యూహెచ్​ఓ అమెరికా పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు డబ్యూహెచ్​ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ప్రకటించింది. ఇలాంటి సమయాల్లో డబ్యూహెచ్​ఓను బలపర్చాలి తప్ప బలహీన పర్చకూడదని హితవు పలికింది.

డబ్యూహెచ్​ఓ నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. అమెరికన్లతో సహా ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని సంస్థ ఎక్స్‌లో పోస్టు చేసింది. బలమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం, వ్యాధి మూల కారణాల గుర్తింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సంస్థ ఏర్పాటైన 1948 నుంచి అమెరికా కీలకంగా వ్యవహరించిందని గుర్తుచేసింది. ఏడు దశాబ్ధాల్లో ప్రపంచంలో మశూచిని అంతం చేసి, పోలియోను చివరి దశకు తీసుకొచ్చామని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగే నిర్ణయంపై అమెరికా పునరాలోచన చేయాలని ఆశిస్తున్నట్లు వివరించింది. కోట్ల మంది శ్రేయస్సు కోసం అమెరికా-డబ్యూహెచ్​ఓ మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కోరింది.

WHOకు చైనా పూర్తి మద్దతు
అమెరికా వైదొలిగినా డబ్యూహెచ్​ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది. సంస్థను మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా బలహీన పరచకూడదని పేర్కొంది. ఆరోగ్యకర ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొంది. డబ్యూహెచ్​ఓ కార్యకలాపాలకు మద్దతును కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

'అన్యాయం అందుకే వైదొలిగాం'
అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగే ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు. 32.5కోట్ల జనాభా ఉన్న అమెరికా, డబ్యూహెచ్​ఓకు 50 బిలియన్‌ డాలర్లు నిధులు ఇస్తుంటే 140కోట్ల జనాభా గల చైనా 3.90 బిలియన్‌ డాలర్లే చెల్లిస్తోందనీ ట్రంప్‌ ఆరోపించారు. ఇది అన్యాయం కనుకనే వైదొలగుతున్నట్లు ట్రంప్‌ తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తి సమయంలోనూ డబ్యూహెచ్​ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ట్రంప్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. తొలిసారి అధ్యక్షుడైన సమయంలోనే డబ్యూహెచ్​ఓ నుంచి వైదొలగాలని ట్రంప్‌ చూశారు. ఎన్నికల్లో బైడెన్‌ గెలుపొందడం వల్ల ఆ నిర్ణయంపై వెనుకడుగు వేశారు. తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో డబ్యూహెచ్​ఓ నిధులకు కొరత తలెత్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై పరిశోధన, సమాచార మార్పిడిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details