తెలంగాణ

telangana

ETV Bharat / international

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన- లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడి- హమాస్​కు ట్రంప్​ వార్నింగ్!

ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన- లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడి

Israel Attack on Lebanon
Israel Attack on Lebanon (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 12:41 PM IST

Updated : Dec 3, 2024, 2:24 PM IST

Israel Attack on Lebanon :ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. తాజాగా లెబనాన్‌ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మృతి చెందినట్లు లెబనాన్‌ అధికారులు తెలిపారు. టెల్‌అవీవ్‌ తొలుత ఉల్లంఘనకు పాల్పడిందని హెజ్‌బొల్లా ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకొని ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న పోరు ఆపేందుకు అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్​ హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు.

ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అది నవంబర్​ 27 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఇజ్రాయెల్‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని హెజ్​బొల్లా ఆరోపించింది. అందుకు ప్రతీకారంగా సీజ్‌ ఫైర్‌ను ఉల్లంఘించిన హెజ్బొల్లా, ఇజ్రాయెల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ఫలితంగా లెబనాన్‌పై యుద్ధవిమానాలతో ప్రతిదాడులు చేసిన నెతన్యాహు సేనలు 11 మందిని బలిగొన్నాయి. ఈ దాడులను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రక్షణ మంత్రి కాట్జ్‌ తీవ్రంగా ఖండించారు. హెజ్‌బొల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హమాస్​కు హెచ్చరిక
ఇదిలా ఉండగా మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్‌ అధికారం చేపట్టకముందే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ హమాస్​ సంస్థపై విరుచుకుపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

'నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు చేపడతాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తాను. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి' అని హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్‌ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అమెరికా-ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ మాట్లాడారు. అందులో 'నేను గత 420 రోజులుగా హమాస్‌ చెరలో బందీగా ఉన్నా. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి' అని అలెగ్జాండర్‌ అన్నాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించి ఎడాన్‌తో సహా బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈక్రమంలోనే డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ మేరకు హెచ్చరించారు.

Last Updated : Dec 3, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details