French Mass Rape Case :ఫ్రాన్స్‌లో భార్యకు మత్తుమందు ఇచ్చి అనేక మందితో అత్యాచారం చేయించిన కేసులో అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫ్రాన్స్‌లో సంచలనం రేపిన ఈ సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి మాజీ భర్త డొమినిక్ పెలికాట్‌ను అవిగ్నాన్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా డొమినిక్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్‌కు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
కోర్టు వద్దకు భారీగా ప్రజలు, సామాజిక కార్యకర్తలు
తాజా తీర్పుతో 72 ఏళ్ల డొమినిక్ దాదాపు అతడు మరణించే వరకు జైల్లోనే గడిపే అవకాశముంది. అటు కేసులోని మిగతా 51 మంది నిందితులకు నాలుగేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పును వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సామాజిక కార్యకర్తలు అవిగ్నాన్ కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితుడికి శిక్ష ఖరారు చేయగానే సంబరాలు చేసుకున్నారు. బాధితురాలికి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని కోర్టు బయట నినాదాలు చేశారు.
అసలేం జరిగిందంటే?
ఫ్రాన్స్‌లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొమినిక్ పెలికాట్ తన భార్యపట్ల కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. రాత్రి పూట ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాల్లో రికార్డు చేసి వికృత ఆనందాన్ని పొందేవాడు. ఇలా దాదాపు పదేళ్లపాటు ఆమెపై అకృత్యాలు సాగించాడు. 2011 నుంచి 2020 మధ్య ఈ దారుణాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.