తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ వరుస విజయాలు- రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్! - Donald Trump Wins

Donald Trump Republican Primary : అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దిశగా అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న న్యూ హ్యాంప్​షైర్ ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందారు. మరోవైపు, ఇదే రాష్ట్రంలో డెమొక్రాట్ల అభ్యర్థిగా జో బైడెన్ విజయం సాధించారు.

Donald Trump Republican Primary
Donald Trump Republican Primary

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 9:12 AM IST

Updated : Jan 24, 2024, 9:57 AM IST

Donald Trump Republican Primary :రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అయోవాలో గెలిచిన ట్రంప్ తాజాగా న్యూ హ్యాంప్​షైర్ ప్రైమరీలోనూ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ 52.5 శాతం ఓట్లతో విజయం సాధించారు. ట్రంప్ తర్వాత స్థానంలో ఉన్న నిక్కీ హేలీకి 46.6 శాతం ఓట్లు వచ్చాయి. ఊహించిన దానికంటే హేలీకి అధిక ఓట్లు రావడం విశేషం. అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీ అంతా ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యే ఉంది.

అధ్యక్ష పదవిలో లేకుండా వరుసగా అయోవా, న్యూ హ్యాంప్​షైర్​లలో గెలుపొందిన తొలి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ రికార్డు సృష్టించారు. న్యూ హాంప్​షైర్ ప్రైమరీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచిన ఏకైక రిపబ్లికన్ అభ్యర్థి కూడా ఈయనే కావడం విశేషం. తాజా విజయాలతో రిపబ్లికన్ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ట్రంప్​నకు దాదాపు లైన్ క్లియ‌ర్ అయినట్లే కనిపిస్తోంది. 2024లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​తో ఆయన తలపడే అవకాశం ఉంది.

న్యూహాంప్‌షైర్‌ ప్రైమరీలో వరుసగా మూడుసార్లు గెలిచిన రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్ ఒక్కరేనని ఇటీవల రేసు నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. ఈ దశలోనే నిక్కీ హేలీ పోటీ నుంచి వైదొలగి ట్రంప్​నకు మద్దతు ఇవ్వాలని అన్నారు. ట్రంప్​ ప్రచార బృందం కూడా హేలీకి ఇదే సూచించింది. హేలీ ఇలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి దోహదం చేసినవారవుతారని విమర్శించింది.

'జో బైడెన్​ను ఓడించే సత్తా ఉంది'
నిక్కీ హేలీ మాత్రం రేసులో కొనసాగడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ట్రంప్‌ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే రేసు ఇంకా ముగియలేదని పేర్కొన్నారు హేలీ. "పోటీ ఇంకా తొలి దశలోనే ఉంది. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. రిపబ్లికన్‌ అభ్యర్థిత్వం కోసం మొత్తం 14 మంది పోటీకి దిగారు. చివరకు నేను మాత్రమే ట్రంప్‌తో పోరాడుతున్నాను. జో బైడెన్‌- కమలా హ్యారిస్‌ను ఓడించే సత్తా నాకు మాత్రమే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డెమొక్రాట్లు మాత్రం అభ్యర్థిగా ట్రంప్​ ఉండాలని అంటున్నారు. అప్పుడే వారికి విజయం సులువవుతుంది" అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.

న్యూహాంప్​షైర్​ ప్రైమరీలో జో బైడెన్​ విజయం
మరోవైపు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ న్యూ హ్యాంప్​షైర్​ ప్రైమరీలో విజయం సాధించారు. ఎలాంటి ప్రచారలు చేయకుండానే ఆయన గెలపొందారు. పార్టీ అభ్యర్థిగా జో బైడెన్​ను గెలిపించాలని ఆయన మద్దతుదారులు ప్రచారం చేశారు. మాజీ, ప్రస్తుత అధ్యక్షులు వరుసగా ప్రైమరీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​, ట్రంప్​ మధ్యే పోటీ ఉండేలా కనిపిస్తోంది.

Last Updated : Jan 24, 2024, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details