Donald Trump Fine : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సివిల్ ఫ్రాడ్ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు 355 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ. 2,946 కోట్లు ) భారీ జరిమానా విధించింది. అలానే న్యూయార్క్‌లోని కార్పొరేషన్లో డైరెక్టర్‌గా లేదా అధికారిగా పనిచేయకుండా మూడేళ్ల పాటు ట్రంప్‌పై నిషేధం విధించింది.
ట్రంప్ తన నికర ఆస్తుల విలువలను ఎక్కువగా చూపించి బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. మోసపూరితంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతోనే తన ప్రాజెక్టులు పూర్తి చేశారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్‌కు కనీసం 370 మిలియన్ డాలర్లు జరిమానా విధించాలని న్యాయమూర్తిని కోరారు. రెండు నెలల క్రితమే ఈ కేసుపై న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ విచారణ చేపట్టి తీర్పును రిజర్వు చేసి ఉంచారు. శుక్రవారం ఈ తీర్పును వెల్లడించారు.
ఆస్తులు పెంచి మోసం!
ట్రంప్ తనకు ఉన్న ఆస్తుల విలువను పెంచేందుకు ఆర్థిక నివేదికలను తరచూ మార్చారని అటార్నీ జనరల్ ఆరోపించారు. ట్రంప్ టవర్ పెంట్ హౌస్ విస్తీర్ణాన్ని మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ విలువను కూడా అధికంగా లెక్కగట్టారని చెప్పారు. ఇలా ట్రంప్ తన సంపదను 3.6 బిలియన్ డాలర్ల మేర పెంచుకున్నారని తెలిపారు.