US Election 2024 :అమెరికా అధ్యక్ష రేసులో కొనసాగుతానని స్పష్టం చేసిన బైడెన్, మరోసారి పొరపడ్డారు. 'అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు ట్రంప్', 'ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోసారి అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యం ఆయనకు లేదంటూ సొంత పార్టీతో పాటు అనేక మంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ మరోసారి తడబడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు ట్రంప్'
నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ''మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా?'' అని పాత్రికేయులు అడిగారు. దీనికి స్పందించిన బైడెన్ ''అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు'' అని బదులిచ్చారు. పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనాల్సింది పోయి ట్రంప్ అనేశారు బైడెన్. దీంతో ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శిస్తున్నారు.
'ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్'
మరోవైపు మీడియా సమావేశానికి ముందు నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేసే క్రమంలోను బైడెన్ తడబడ్డారు. గొప్ప సంకల్పం, ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తిగా ఆయన్ని కొనియాడుతూ ఆయనను ప్రసంగించమని కోరారు. ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ ''అధ్యక్షుడు పుతిన్'' అని సంబోధించారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, జెలెన్‌స్కీ మాత్రం నవ్వుతూ దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అయితే, సమావేశానంతరం వివిధ దేశాధినేతలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. ఎవరికైనా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమేనని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం బైడెన్ చురుగ్గా కనిపించినట్లు తెలిపారు.
పోటీలో ఉంటానని స్పష్టం!
మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఎప్పటిలాగే తానే పోటీకి అర్హుడినని, రేసులో కొనసాగుతానని పునరుద్ఘాటించారు. కేవలం పదవి కోసం తాను పోటీలో లేనని, అనుకున్న పని పూర్తి చేసేందుకే బరిలోకి దిగానని స్పష్టం చేశారు. కచ్చితంగా ట్రంప్‌ను ఓడించి తీరతానని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేశానని చెప్పారు. ఎక్కడైనా నెమ్మదించిన దాఖలాలు ఉంటే పోటీ విషయంలో పునరాలోచన చేసేవాడినని తెలిపారు. ఇప్పటి వరకు అలా జరగలేదని, ఫలితంగా తాను పోటీకి అర్హుడినేనని ప్రకటించుకున్నారు.