Goddess Kali Crown Stolen :2021 మార్చిలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాతకు ఇచ్చిన కిరీటాన్ని ఎవరో దొంగిలించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, నేరస్థులను పట్టుకొని, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
"ప్రధాని నరేంద్ర మోదీ కాళీ మాతకు ఇచ్చిన కిరీటం దొంగతనానికి గురికావడం చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు ప్రారంభించి, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. దీనికి బాధ్యులైన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి."
- బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం
ఇంతకీ ఏం జరిగింది?
బంగ్లాదేశ్‌లోని సత్కిరా, శ్యామ్నగర్లో జెషోరేశ్వరీ దేవీ ఆలయం ఉంది. ఆ ఆలయంలోని కాళీ మాతకు 2021లో భారత ప్రధాని ఒక కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అయితే గురువారం ఆలయ పూజారి దిలీప్ ముఖర్జీ పూజలు ముగించి, బయటకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్యలో దొంగతనం జరిగింది. ది డైరీ స్టార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఆలయంలో పనిచేసే సిబ్బంది (ఆలయాన్ని శుభ్రపరిచే వ్యక్తులు) దుర్గా మాత తలపై ఉన్న కిరీటాన్ని తీసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలను గుర్తించేందుకు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.