Arctic Ocean Ice :అంటార్కిటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఎటు చూసినా మంచే ఎక్కువగా దర్శనమిస్తోంది. అయితే ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఎంత మేర తగ్గుతుందో తెలుసుకునేందుకు కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు దశాబ్దాల తరబడి చేసిన పరీక్షల నివేదికలను విశ్లేషించారు. ఈ శతాబ్దం మధ్యకల్లా ఆర్కిటిక్ సముద్రంలో సంవత్సరంలో ఒక నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని తెలిపారు.
జంతువుల మనుగడకు ఇబ్బందులు తప్పవ్!
ఆర్కిటిక్ సముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణం కంటే తక్కువ ఉంటే దాన్ని మంచురహితంగా పరిశోధకులు చెబుతారు. సముద్రంలో మంచు లేకపోతే మంచు ఎలుగుబంట్లు లాంటి జంతువుల మనుగడకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. వేటాడడం, సంతానోత్పత్తికి అవి సముద్రపు మంచు మీదనే ఆధారపడతాయని పరిశోధకురాలు జాన్ తెలిపారు. అయితే గ్రీన్ లాండ్ పరిసరాల్లో నివసించే వాటికి ఇబ్బందులు ఉండవని జాన్ చెప్పారు.
మానవ చర్యలు, భూతాపమే కారణం!
ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈ పరిస్థితికి మానవ చర్యలు, భూతాపమే కారణమని పరిశోధకురాలు జాన్ తెలిపారు. తేలియాడే సముద్రపు మంచు కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలలో నివసించే జన జీవనానికి ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఆర్కిటిక్ సముద్రంలో ఎక్కువ రోజుల పాటు సముద్రపు మంచు ఉండకపోవచ్చని కూడా వివరించారు.