Alexei Navalny Dead Body :రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ విషయాన్ని నావల్నీ అనుచరుడు, ఆయనకు సంబంధించిన అవినీతి నిరోధక ఫౌండేషన్ డైరెక్టర్ ఇవాన్ జ్దానోవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మృతదేహం అప్పగింతకు రష్యాపై ఒత్తిడి తెచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు.
'క్రైస్తవ మతాన్ని పుతిన్ కించపరుస్తున్నారు'
ఇటీవల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఒక జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో నావల్నీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన మృతదేహాన్ని అక్కడే రహస్యంగా సమాధి చేయడానికి ఒప్పుకోవాల్సిందిగా ఆయన తల్లిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒత్తిడి తెస్తున్నారని నావల్నీ భార్య యూలియా నావల్నయా మొదట ఆరోపించారు. పుతిన్ తన చర్యలతో మతాన్ని కించపరుస్తున్నారని ఓ వీడియోలో యూలియా విమర్శలు గుప్పించారు. నావల్నీ మృతదేహం ఇప్పటికే కుళ్లిపోవడం ఆరంభించినందున, వెంటనే ఖననం చేయడానికి ఒప్పుకోవాలని ఆయన తల్లిని అధికారులు వేధిస్తున్నారని ఆమె తెలిపారు.
'నావల్నీని చనిపోయాక కూడా చిత్రవధ చేస్తున్నారు'
తన భర్త నావల్నీని బతికుండానే కాకుండా చనిపోయిన తరవాత కూడా చిత్రవధ చేస్తున్నారని యూలియా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని అవహేళన చేస్తున్నారనీ అన్నారు. నావల్నీ మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే మృతదేహం అప్పగింత సమాచారం వెలుగుచూసింది. నావల్నీ అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే నావల్నీ మృతికి పుతిన్ కారకుడన్న ఆరోపణల్ని రష్యా అధ్యక్ష భవనం ఖండించింది.