Pakistan On Kargil War :భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్‌కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. 'ఆపరేషన్ విజయ్' పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి శత్రుసేనలను తరిమికొట్టింది. ఇది జరిగి పాతికేళ్లు అయినప్పటికీ దాయాది సైన్యం మాత్రం యుద్ధంలో తమ ప్రమేయం లేదంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత ఆ దేశ సైన్యాధిపతే తమ పాత్రను అంగీకరించడంతో పాక్ ఓటమి గుట్టు అధికారికంగా రట్టయ్యింది!
పాకిస్థాన్, రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో శుక్రవారం డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. అందులో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కార్యక్రమంలో జనరల్ మునీర్ మాట్లాడుతూ, "భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ యుద్ధాల్లో వేలాది మంది పాక్ సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది" అని అన్నారు. ఈ విధంగా కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం పాత్రను ఆయన చెప్పకనే చెప్పారు.
ముజాహిదీన్‌ల ముసుగులో పాక్ సైన్యం
1999 మే-జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు కార్గిల్‌లో ఖాళీగా ఉన్న మన కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్'ను చేపట్టింది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాక్, తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని పొలిమేరల వరకు తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ఆ రోజున కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటున్నాం.
దొంగ మాటలు
అయితే, ఈ కార్గిల్ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్థాన్ గత 25 ఏళ్లుగా చెప్పుకొంటూ వస్తోంది. ముజాహిదీన్‌లు లేదా కశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని, తాము కేవలం పెట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. కానీ పాక్ చెప్పిన ఈ దొంగ మాటలను భారత్ కొట్టిపారేసింది. యుద్ధంలో పాక్ సైన్యం పాత్ర ఉందని తెలియజేసే కీలక ఆధారాలను బహిర్గతం చేసింది. ప్రధానంగా అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ముషారఫ్, ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్‌లు రావల్పిండిలో జరిపిన ఫోన్ సంభాషణలను విడుదల చేసింది. దీనిలో ఎల్‌వోసీని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి వెల్లడిస్తున్న వివరాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్ యుద్ధంలో తమ దేశ బలగాల పాత్ర వాస్తవమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను 'ఫోర్ మ్యాన్ షో' అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ పేర్కొన్నారు. అప్పటి ఆర్మీ జనరల్ ముషారఫ్‌తో పాటు కొందరు టాప్ కమాండర్లకు మాత్రమే దాని గురించి తెలుసుని అయన అన్నారు. అయితే, అప్పట్లో ఆ వ్యాఖ్యలపై స్పందించేందుకు పాకిస్థాన్ నిరాకరించింది.