Brazil Bus Accident :బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. రాష్ట్ర హైవేపై శనివారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
ఇదీ జరిగింది
సావోపోలో నగరం నుంచి బయలుదేరిన బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, బస్సు టైరు ఊడిపోవడం వల్ల డ్రైవరు నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొన్నాడు. పెద్ద గ్రానైటు రాయి బస్సును తాకినట్లు మరికొందరు తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు ప్రయాణికులతో అటువైపు వచ్చిన కారు సైతం బస్సును ఢీకొంది. కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు, ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే కారులోని వారు గాయాలతో బయటపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తమ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారని అగ్నిమాపక విభాగం లెఫ్టినెంట్ అలెన్సో తెలిపారు.
ఇరాన్లో 9 మంది మృతి
మరోవైపు,పశ్చిమ ఇరాన్‌లోని మారుమూల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. డ్రైవర్ వేగంగా వెళ్తున్న వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్ల బస్సు లోయలో పడడం వల్ల జరిగిందీ దుర్ఘటన.
అండిమెష్క్, పోల్-ఇ-డోఖ్తర్ పట్టణాలను కలిపే రహదారిపై పా-ఆలం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 27 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే వాహనం అదుపు తప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
క్రిస్మస్ మార్కెట్‌పై ఉగ్రదాడి
తూర్పు జర్మనీలోని మాగ్దబగ్ నగరంలో క్రిస్మస్ కొనుగోలుదారులతో రద్దీగా ఉన్న మార్కెట్‌లో ఒక కారు జనంపైకి దూసుకు పోగా ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు సహా 200 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం నాటి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని అధికారులు తెలిపారు. దురాగతానికి కారకుడైన వ్యక్తిని సౌదీ అరేబియాకు చెందిన వైద్యుడు ఎ.తలేబ్(50)గా గుర్తించారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఘటనా స్థలంలోనే అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులు అరెస్టుచేశారు. తనను తాను మాజీ ముస్లింగా పేర్కొనే తలేబ్ ఎందుకు ఈ దురాగతానికి పాల్పడ్డాడన్నది ఇంకా స్పష్టం కాలేదు.