World Diabetes Day 2024:మీరు దీర్ఘకాలంగా మధుమేహంతో బాధుపడుతున్నారా? అయితే, మీకు గుండెపోటు, పక్షవాతం, నాడులు దెబ్బతినటం వంటి జబ్బుల ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వీటిల్లో ఏదో సమస్య బారినపడ్డవారికి ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతున్నట్టు డయాబిటిస్ కేర్ పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మిషిగన్ మెడిసిన్, యూ-ఎం స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు గలవారికీ మధుమేహంతో ముడిపడిన దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టూ అధ్యయనంలో బహిర్గతమైంది. అంటే మధుమేహ దుష్ప్రభావాలు, మానసిక సమస్యలు రెండూ పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని ఈ పరిశోధనలో తేలింది. ఈ రెండింటి మధ్య సంబంధం ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మధుమేహ దుష్ప్రభావాలు, మానసిక సమస్యలు రెండూ ఒకేరకం ముప్పు కారకాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, గ్లూకోజు నియంత్రణలో లేకపోవటం వంటివి ఈ సమస్యలు ముంచుకొచ్చేలా చేస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల మధుమేహానికి చికిత్స చేసే వైద్యులు ముందు జాగ్రత్తగా దీని దుష్ప్రభావాలతో పాటు మానసిక సమస్యలను గుర్తించే పరీక్షలు కూడా చేయాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
మధుమేహ దుష్ప్రభావాలు గలవారికి ఆందోళన లేదా కుంగుబాటు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మానసిక జబ్బు గలవారికి మధుమేహ దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం 2.5 రెట్లు అధికంగా ఉంటున్నట్టు వివరించారు. అయితే, వీటి మధ్య పరస్పర సంబంధానికి కారణం ప్రత్యక్ష ప్రభావం కారణం కాకపోవచ్చని పరిశోధకులు అనుకుంటున్నారు. ఉదాహరణకు- పక్షవాతం కారణంగా మెదడు మీద విపరీత ప్రభావం పడి ఇది నేరుగా కుంగుబాటుకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆందోళన, కుంగుబాటు గలవారు కూడా మధుమేహ నియంత్రణపై అంత శ్రద్ధ చూపకపోవచ్చని.. ఫలితంగా గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోక పోవటం, మందులు సరిగా వేసుకోకపోవటం వల్ల పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర దుష్ప్రభావాలకు కారణం కావొచ్చని అంటున్నారు.