Why Trust Is Lost In Relationships :పెళ్లి అనే బంధంతో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు మనుషులు ఒకటవుతారు. వీరి కాపురం కడవరకూ పచ్చగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొన్ని సంసార బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. మరి.. ఈ పరిస్థితి కారణాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.
నమ్మకం కోల్పోవడం :
భార్యాభర్తల సంసారం సక్రమంగా సాగిపోవాలంటే.. ఇద్దరి మధ్యా ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఇది ఉన్నప్పుడే దాంపత్య సాఫీగా సాగిపోతుంది. అది లోపిస్తే.. ఆ సంసారం దారం తెగిన గాలిపటంగా మారిపోతుందని, ఇదే ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. భాగస్వామి తనను మోసం చేస్తున్నారని తెలిస్తే.. ఇక మనస్పూర్తిగా వారితో కలిసి కాపురం చేయలేరని అంటున్నారు. ఒకసారి మొదలైన అనుమానం.. ప్రతి విషయానికీ విస్తరించి మొత్తం దాంపత్యాన్నే నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ.. ఇల్లే ఒక నరకంలా మారుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని వేళ్లతో సహా పెకిలించకపోతే.. అది విడాకుల రూపంలో బంధాన్నే శాశ్వతంగా నాశనం చేసేస్తుందని అంటున్నారు. అందుకే.. ఇద్దరి మధ్యా నమ్మకం ప్రధానమని.. దీన్ని పెంచుకోవడానికి కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు.
మనసు విప్పి మాట్లాడుకోవాలి :
ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి తిరిగి వస్తుంటారు. వీటికి తోడు వేధిస్తున్న ఆర్థిక సమస్యలు కావొచ్చు.. మరేదైనా కారణాలు కావొచ్చు.. వాటితో మరింతగా ముడుచుకుపోతుంటారు. దీంతో.. ఇంట్లో ఒక నిరుత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని వెంటనే క్లియర్ చేసుకోవాలని బాధ్యత ఇద్దరిమీదా ఉంటుంది. దీనికోసం ఇద్దరూ తమకంటూ కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడే.. ఇద్దరి మధ్యా అనుబంధం పెరుగుతుంది. ప్రేమ, ఆప్యాయతలు బలపడతాయి. అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా ఉంటే.. గ్యాప్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వస్తే.. ఇతరుల పట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, రోజూ భార్యభర్తలిద్దరూ ఒక అరగంటైనా మనసువిప్పి మాట్లాడుకోవాలని అంటున్నారు.
ప్రామిస్ మరిచిపోకండి :
భాగస్వామికి మాట ఇస్తే.. నిలబెట్టుకోండి. మీపై నమ్మకాన్ని పెంచడంలో ఇది చాలా ముఖ్యం. కొంత మంది తమ భాగస్వామిని మెప్పించడానికి పెళ్లి, పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు తెస్తాననో.. ఎక్కడికైనా తీసుకెళ్తాననో.. ఇలా మాట ఇస్తుంటారు. కానీ.. కొన్ని కారణాల వల్ల వారు మర్చిపోతుంటారు. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే.. మీపై నమ్మకం కోల్పోతారు. కాబట్టి.. ఈ పరిస్థితి రానివ్వకండి. మాట ఇచ్చే ముందే ఆలోచించుకోండి. కుదరకపోతే ముందే ఓపెన్‌గా చెప్పండి. కానీ.. అప్పటి వరకూ మూడ్ మార్చడం కోసమని నెరవేర్చలేని హామీలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.